Telangana rice production record | దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ..

Telangana rice production record | దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ..


Telangana rice production record | యాసంగిలో వరి సాగులో తెలంగాణ అగ్రస్థానం

రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లు

దేశంలో 61 శాతం వరి విస్తీర్ణం తెలంగాణదే


Telangana rice production record | హైదరాబాద్, ఆంధ్రప్రభ : వ్యవసాయ రంగంలో తెలంగాణ మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది. 2025–26 యాసంగి సీజన్లో వరి సాగు విస్తీర్ణం, ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 65.91 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా, సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దేశవ్యాప్తంగా యాసంగి సీజన్లో సాగైన మొత్తం వరి విస్తీర్ణంలో 61 శాతం తెలంగాణ వాటా ఉండడం రాష్ట్ర వ్యవసాయ రంగం సాధించిన అపూర్వ విజయంగా నిలిచింది.

ప్రణాళిక శాఖ నివేదికల ప్రకారం, దేశంలోని పలు రాష్ట్రాల్లో నీటి కొరత కారణంగా యాసంగి సాగు పరిమితంగా ఉన్నప్పటికీ, తెలంగాణలో మాత్రం రైతులు భారీ స్థాయిలో వరి సాగు చేపట్టారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సమృద్ధిగా నీరు అందుబాటులో ఉండడం, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

యాసంగి సీజన్లో తెలంగాణలో 65.91 లక్షల ఎకరాల్లో వరి సాగు నమోదైంది. తమిళనాడులో 30.76 లక్షల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 17.29 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయింది. ఖరీఫ్, యాసంగి రెండు సీజన్లను కలిపి చూస్తే అత్యధిక వరి సాగు విస్తీర్ణంలో ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

ధాన్యం కొనుగోళ్లలోనూ తెలంగాణ తన శక్తివంతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 75 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కొనుగోళ్లు మరో వారం రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో ఈ సంఖ్య 80 లక్షల టన్నులను దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మొత్తం ధాన్యం కొనుగోళ్లు కలిపినా 40 లక్షల టన్నుల లోపే ఉండటం తెలంగాణ సాధించిన అద్భుత ఘనతకు నిదర్శనం.

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 69.90 లక్షల ఎకరాలు, యాసంగిలో 65.91 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 135.81 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రెండు సీజన్లలో కలిపి రాష్ట్రంలో సుమారు 282 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్లు పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది.


Leave a Reply