ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేష్ సేవలు మరువలేనివి

ఊట్కూర్, ఆంధ్రప్రభ: పదేళ్లపాటు ఊట్కూర్ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా) ఏఈగా విధులు నిర్వహించిన వెంకటేష్ సేవలు మరువలేనివని అధికారులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న వెంకటేష్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానం చేసి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో పావని, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సి. సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఎల్కోటి నారాయణరెడ్డి, మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సర్పంచ్‌లు కతలప్ప, ఎం. రేణుక భరత్, సత్యనారాయణ రెడ్డి, నర్సిములు, జాఫర్ తదితరులు మాట్లాడుతూ వెంకటేష్ తన సేవా కాలంలో గ్రామాలకు తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు విశేషంగా కృషి చేశారని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను వెంటనే పరిష్కరించేవారని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో సమర్థవంతంగా పనిచేస్తూ అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో వ్యవహరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ బాలాజీ, పీఆర్ ఏఈ అజయ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.