Papikondalu Tourism | గోదావరి నదిలో తరుచూ చిన్న చిన్న ప్రమాదాలు
Papikondalu Tourism | గోదావరి నదిలో తరుచూ చిన్న చిన్న ప్రమాదాలు
Papikondalu Tourism | పర్యాటక లాంచీలలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు
ప్రమాదాలు జరిగితే బాధ్యులెవరు?
కచ్చులూరు ప్రమాదం నేటికీ చేదు జ్ఞాపకం
Papikondalu Tourism | పోలవరం (రంపచోడవరం) జిల్లా, ఆంధ్రప్రభ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య విస్తరించి ఉన్న పాపికొండలు రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ ప్రకృతి పర్యాటక కేంద్రాల్లో ఒకటి. గోదావరి నదిలో లాంచీ ప్రయాణం, కొండల మధ్య సుందర దృశ్యాలు, గిరిజన సంస్కృతి, ప్రకృతి అందాలు ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో నదీ ప్రయాణాల భద్రత, లాంచీల నిర్వహణ, అత్యవసర సహాయక చర్యలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో పాపికొండల పర్యాటకుల ప్రాణాలు నిజంగా భద్రమేనా? అనే సందేహం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
దేవిపట్నం మండలం నుంచి 13 ప్రైవేట్ లాంచీలు, ఒక ఏపీ టూరిజం లాంచీ నడుస్తున్నాయి. విఆర్ పురం మండలం పోచవరం నుంచి 20 ప్రైవేట్ లాంచీలు, ఒక ఏపీ టూరిజం బోటు నడుస్తున్నాయి. ఈ లాంచీల భద్రతపై అనేక ఆరోపణలు వస్తున్నాయి.
తాజా సంఘటనతో..
పోలవరం జిల్లాలోని దేవిపట్నం మండలం గండిపోశమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి పాపికొండల విహారయాత్రకు బయలుదేరిన లాంచీ శుక్రవారం సాంకేతిక లోపంతో గోదావరి నదిలో నిలిచిపోయింది. ఆ సమయంలో లాంచీలో సుమారు 89 మంది పర్యాటకులు ఉన్నారు.
లాంచీ దేవిపట్నం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చేరుకునేసరికి సరంగు లాంచీని నిలిపివేసి కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చాడు. అనంతరం మరో బోటును పంపి పర్యాటకులను విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈ తరుణంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే బాధ్యులు ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరువలేని గాయాలు – ప్రకృతి ప్రమాదాలు
గతంలో జరిగిన ప్రధాన ఘటనల్లో ‘రాయల్ వశిష్ఠ’ అనే ప్రైవేట్ పర్యాటక బోటులో 60 మందికి పైగా పర్యాటకులు ఉన్నారు. బలమైన ప్రవాహం, వరద పరిస్థితులు, భద్రతా నిబంధనల ఉల్లంఘనల కారణంగా బోటు ఒక్కసారిగా ఒరిగి మునిగిపోయింది. లైఫ్ జాకెట్లు ధరించకపోవడంతో సుమారు 51 మంది మరణించారు. ఈ ఘటన ఇప్పటికీ ప్రజల మనసుల్లో చేదు జ్ఞాపకంగా మిగిలింది.
ప్రతి లాంచీలో వైర్లెస్ కమ్యూనికేషన్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ తప్పనిసరి చేయాలి. రెస్క్యూ బోట్లు నిరంతరం సిద్ధంగా ఉండాలి. వాతావరణ హెచ్చరికలను కచ్చితంగా పాటించాలి.
అందాల మధ్య దాగి ఉన్న ప్రమాదాలు
పాపికొండల ప్రాంతంలో గోదావరి నది కొన్నిచోట్ల లోతుగా ఉండటంతో పాటు ప్రవాహం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. వర్షాకాలంలో నీటి మట్టం పెరగడం, వరదలు, ఆకస్మిక వాతావరణ మార్పులు పడవ ప్రయాణాలను ప్రమాదకరంగా మారుస్తాయి. ఒకే పడవలో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం, భద్రతా నిబంధనలు పాటించకపోవడం వంటి ఆరోపణలు గతంలో పలుమార్లు వినిపించాయి.
కచ్చులూరు బోటు ప్రమాదం
2019 సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత విషాదకరమైన జల ప్రమాదాల్లో ఒకటి.
తాత్కాలికంగా నిలిపివేత
భద్రతా ఆందోళనల నేపథ్యంలో రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె. స్వాతి ఆదేశాల మేరకు అన్ని పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదేశాలతో బోట్ల ఫిట్‌నెస్, సాంకేతిక స్థితి, భద్రతా ప్రమాణాలు, లైఫ్ జాకెట్లు, అత్యవసర పరికరాలు తదితర అంశాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు.
