భోగాపురం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై పల్లా సమీక్ష
- 125 బస్సుల్లో కార్యకర్తల తరలింపునకు ప్రణాళిక
- ఆహారం, రవాణా, సమన్వయ ఏర్పాట్లపై విస్తృత చర్చ
- అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచన
విశాఖపట్నం, ఆంధ్రప్రభ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గం నుంచి హాజరయ్యే కార్యకర్తలకు సంబంధించిన ఆహారం, రవాణా, ఇతర ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు.
గాజువాక జోనల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. గాజువాక నియోజకవర్గం నుంచి సుమారు 5,000 మంది కార్యకర్తలు 125 బస్సుల ద్వారా కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో వారి ప్రయాణం, ఆహార సదుపాయాలు, సమన్వయం తదితర అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారు.
కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని, రవాణా నుంచి ఆహార పంపిణీ వరకు ప్రతి అంశంలో సమన్వయంతో వ్యవహరించాలని సంబంధిత బాధ్యులకు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిశ్వంత్తో పాటు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
