పదవి అంటే హోదా మాత్రమే కాదు.. బాధ్యత కూడా: తన్నీరు నాగేశ్వరరావు
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: జిల్లా స్థాయిలో పార్టీ పదవులు పొందిన పెనుగంచిప్రోలు మండల నాయకులకు స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో గురువారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై నాయకులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పదవి అంటే హోదా మాత్రమే కాదని, ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత కూడా ఉంటుందని అన్నారు. పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజలకు నిరంతరం సేవలందించాలని పదవులు పొందిన నాయకులకు సూచించారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు కనిపించడం లేదన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అరాచకాలను గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, పార్టీ జెండా రెపరెపలాడేలా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని తన్నీరు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీల నాయకులు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
