ఫిన్లాండ్ వెళ్లొచ్చిన టీచర్లకు సీఎంచే అరుదైన గౌరవం..

ఇద్దరు ఉపాధ్యాయులకు అరుదైన గౌరవం

విదేశీ విద్యా విధానంపై అధ్యయనం..

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ: ఫిన్లాండ్ విద్యా విధానాన్ని అధ్యయనం చేసి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఈ సన్మానం జరిగింది.

జన్నారం మండలంలోని కిష్టాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు దాముక కమలాకర్, అక్కపల్లిగూడ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్ ఫిన్లాండ్ విద్యా వ్యవస్థపై అధ్యయనం చేసి తిరిగి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా విదేశీ విద్యా విధానాల్లోని ఉత్తమ పద్ధతులను రాష్ట్ర విద్యా వ్యవస్థలో అమలు చేసే దిశగా ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, విద్యాశాఖ కమిషనర్లు నవీన్ నికోలస్, దేవసేన, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్, జన్నారం మండల విద్యాధికారి బానావత్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.