రైతులతో మమేకమైన కలెక్టర్ లక్ష్మీశ..
- తిరువూరులో వరి పొలాల పరిశీలన.. శాస్త్రీయ సాగుపై సూచనలు
( తిరువూరు, ఆంధ్రప్రభ ) : జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ గురువారం తిరువూరు మండలంలో పర్యటించి ఎరువులు, పురుగుమందుల దుకాణం, సరిహద్దు చెక్‌పోస్టును తనిఖీ చేసిన అనంతరం పంట పొలాలను సందర్శించారు.
వామకుంట్ల గ్రామంలోని వరి నాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ రైతులతో ఆత్మీయంగా మాట్లాడి సాగు పరిస్థితులు, ప్రభుత్వ సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ సాగు విధానాలను పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. రైతులు తమ సాగు అనుభవాలను కలెక్టర్‌తో పంచుకోగా, పంటలు సమృద్ధిగా పండాలని ఆయన ఆకాంక్షించారు.
రైతులకు అవసరమైన నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.
సమతుల్య పోషక యాజమాన్యం, నీటి పొదుపు పద్ధతులు పాటించడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు అందిస్తున్న సాంకేతిక సూచనలను పాటిస్తూ సాగు చేపట్టాలని రైతులకు సూచించారు.
