కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన

సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనతోనే భవిష్యత్తుకు బాట: డాక్టర్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: పాఠశాల దశ నుంచే విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని, జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని చౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం గ్రామ ఉపసర్పంచ్, ఉపసర్పంచ్‌ల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.

గురువారం చిన్నకొండూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ భద్రత అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నాగోల్ తట్టిఅన్నారంలోని శ్రేయాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచంతో పోటీ పడాలంటే సాంకేతిక విద్యపై పట్టు అవసరమని తెలిపారు. రోజువారీ జీవితంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వినియోగం, భవిష్యత్తులో వాటి ప్రాధాన్యాన్ని ఉదాహరణలతో వివరించారు.

డిజిటల్ యుగంలో ఎదురవుతున్న సైబర్ సవాళ్లు, ఇంటర్నెట్ వినియోగంలో తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడం, ఆన్‌లైన్ మోసాల నుంచి అప్రమత్తంగా ఉండడం వంటి అంశాలను వివరించారు.

విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించేలా విజ్ఞానవంతమైన ప్రసంగం చేసినందుకు డాక్టర్ సుర్కంటి శ్రీధర్ రెడ్డికి, శ్రేయాస్ ఇన్‌స్టిట్యూట్ మేనేజ్‌మెంట్‌కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమయాన్ని కేటాయించినందుకు ఆయనను ఘనంగా సన్మానించారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి సాంకేతిక అవగాహన కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరారు.