కొనరావుపేట అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ

భూ సర్వే గ్రామసభలో రూ.4 కోట్ల రహదారితో పాటు పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్

రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలంలోని కొనరావుపేట గ్రామ భూ సర్వే గ్రామసభ గురువారం సుల్తాన్‌పూర్ రైతు వేదికలో ఘనంగా నిర్వహించారు. గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ గ్రామసభకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రజల సమస్యలను విన్నారు. భూ సర్వే ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కొనరావుపేట సర్పంచ్ రొడ్డా కిరణ్ గ్రామాభివృద్ధికి సంబంధించిన ఆరు కీలక ప్రతిపాదనలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు వెంటనే ఆమోదం తెలిపారు.

సుల్తాన్‌పూర్–కొనరావుపేట–కొత్తపల్లి ప్రధాన రహదారి అభివృద్ధికి సుమారు రూ.4 కోట్లతో ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే గ్రామాభివృద్ధికి సంబంధించిన ఇతర ప్రతిపాదనలకూ ఆమోదం తెలిపారు.

గ్రామాభివృద్ధికి అవసరమైన పనులకు ఆమోదం లభించడంతో గ్రామ ప్రజలు, రైతులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ సర్పంచ్ రొడ్డా కిరణ్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు, జిల్లా, మండల రెవెన్యూ అధికారులకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

భూ సర్వే గ్రామసభ విజయవంతం కావడంతో పాటు గ్రామాభివృద్ధికి సంబంధించిన కీలక పనులకు ఆమోదం లభించడం కొనరావుపేట అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, నాయకులు నడిపెల్లి విజ్జన్‌రావు, ఇప్పకాయల నర్సయ్య, తహసీల్దార్ హేమలత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.