ప్రజాసేవలో రామారావు ది చెరగని ముద్ర
ప్రజాసేవలో రామారావు ది చెరగని ముద్ర
మాజీ ఎంపీ కేసినేని నాని
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా..
మాజీ ఎంపీపీ కొరివి రామారావుకి ఘన నివాళులు..
ఆంధ్రప్రభ ఏ కొండూరు : మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) గురువారం గొల్లమందల గ్రామంలో పర్యటించి ఇటీవల పరమపదించిన మాజీ ఎంపీపీ స్వర్గీయ కొరివి వీర వెంకట రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం స్వర్గీయ కొరివి రామారావు నివాసానికి వెళ్లిన నాని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కుటుంబ సభ్యులతో పాటు కుమారుడు కొరివి ప్రవీణ్‌ను ప్రత్యేకంగా పరామర్శించి, కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేశినేని నాని, స్వర్గీయ కొరివి వీర వెంకట రామారావు ప్రజాసేవను జీవిత ధ్యేయంగా తీసుకుని పనిచేసిన నాయకుడని కొనియాడారు. గ్రామాభివృద్ధి కోసం తన పదవికంటే ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చి, గొల్లమందల గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన దూరదృష్టి గల నాయకుడిగా గుర్తు చేశారు. విద్య, తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఎంపీపీగా ఉన్న సమయంలో మండల అభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచిన నాయకుడిగా ఆయన పేరు చిరకాలం నిలిచిపోతుందని అన్నారు. స్వర్గీయ కొరివి వీర వెంకట రామారావు మరణం గ్రామానికే కాకుండా మొత్తం మండలానికి తీరని లోటని పేర్కొన్న నాని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.
