నెలాఖరులోగా ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరిగా పొందాలి
లైసెన్స్ లేకుండా వ్యాపార సంస్థలు కొనసాగితే చర్యలు: కమిషనర్ బి. వంశీకృష్ణ
నల్గొండ, ఆంధ్రప్రభ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ ఆదాయాన్ని పెంచడంతో పాటు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా ఏ వ్యాపార సంస్థ కూడా కొనసాగకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ బి. వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు.
నగరంలోని అన్ని వ్యాపార సంస్థలపై షాప్ టు షాప్ సర్వే నిర్వహించి, ట్రేడ్ లైసెన్స్ లేని సంస్థలను గుర్తించి వెంటనే లైసెన్సులు పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిబంధనలు పాటించని సంస్థలకు తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం నోటీసులు జారీ చేసి, అవసరమైతే సీజ్ చేయడం లేదా మూసివేయడం వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆగస్టు నెలాఖరు నాటికి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఏ వ్యాపార సంస్థ కూడా కొనసాగకూడదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన సంబంధిత వార్డు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి వార్డు అధికారి తన పరిధిలో ట్రేడ్ లైసెన్సుల జారీ, ఆస్తి పన్ను వసూళ్లు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, అక్రమ నిర్మాణాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి ప్రతి వార్డులో సమర్థవంతమైన సేవలు అందించాలని ఆదేశించారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం పెంపు లక్ష్యంగా రెవెన్యూ వసూళ్లు, ట్రేడ్ లైసెన్సుల జారీ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.
