మహోన్నత కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం
- అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
- చల్లపల్లి రైతు బజారులో బియ్యం కౌంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే
చల్లపల్లి, ఆంధ్రప్రభ : పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించేందుకు కూటమి ప్రభుత్వం మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం చల్లపల్లి రైతు బజారులో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో తెల్ల రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యం విక్రయాల కౌంటర్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే బీపీటీ బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. బీపీటీ స్టీమ్ బియ్యం కిలో రూ.52, బీపీటీ రా రైస్ కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం నియోజకవర్గంలో మరో ఆరు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మార్కెట్ ధరల నియంత్రణలో రైతు బజార్ల పాత్ర కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ఏడాది కూడా బియ్యం ధరల నియంత్రణ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, టమాటా, ఉల్లిపాయల ధరలు పెరిగిన సమయంలో రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకు వినియోగదారులకు సరఫరా చేశామని గుర్తు చేశారు.
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో రైతు బజార్లు కీలకంగా పనిచేస్తున్నాయని, రైతు బజార్ల ఏర్పాటు ద్వారా రైతులు, డ్వాక్రా మహిళలు, దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందించేందుకు సహకరిస్తున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం రైతు బజారులోని వివిధ స్టాల్స్, వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ఓ, సివిల్ సప్లైస్ జాయింట్ డైరెక్టర్ జీ. మోహనబాబు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతల శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
