చెత్త బయట వేస్తే..
చెత్త బయట వేస్తే..
- మార్నింగ్ శానిటేషన్‌లో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు
- వ్యర్థాలు బయటపడేసే హోటళ్ల యాజమాన్యాలకు హెచ్చరిక
- చెత్త నిర్వహణపై అవగాహన
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి పట్టణంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి మార్నింగ్ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. ఐబీ సమీపంలో హోటల్ నిర్వాహకులు చెత్తను బయట వేయడంతో వారితోనే చెత్త తీయించి హెచ్చరించారు. అనంతరం ఐబీ సమీపంలోని జనప్రియ హోటల్, చార్మినార్ హోటల్, మానస హాస్పిటల్ వద్ద ఉన్న బిందు టిఫిన్ సెంటర్లను పరిశీలించి, నాణ్యమైన వంటనూనె వినియోగించాలని, ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. అలాగే హోటళ్లు, పాన్ షాపులు, టీ దుకాణాలు, రోడ్ల పై చెత్త వేస్తున్న ఇతర వ్యాపార సంస్థల వద్ద చెత్తను సిబ్బందితో శుభ్రం చేయించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రధాన రహదారుల పై ఉన్న హోటళ్లు, షాపుల యాజమాన్యాలు రోడ్ల పై లేదా దుకాణాల ముందు చెత్త వేయడం వల్ల గాలికి చెత్త రోడ్డు మీద వ్యాపించి పారిశుధ్య నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. పట్టణ ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. షాపుల నుంచి వచ్చే పొడి చెత్తను ప్రత్యేక సంచుల్లో నిల్వ ఉంచి, పారిశుధ్య సిబ్బంది వచ్చినప్పుడు వారికి నేరుగా ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వేయరాదని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలు మున్సిపల్ కార్మికులకు సహకరించి చెత్తను బయట వేయకుండా స్వచ్ఛ ఆటోలకు మాత్రమే అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వాడకం ప్రపంచానికి పెను భూతంగా మారిందని పేర్కొన్న కమిషనర్, ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా బట్ట సంచులను వినియోగించాలని ఆయన సూచించారు.
