రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..
- వానాకాలానికి రైతులు సిద్ధం కావాలి
- శాస్త్రవేత్త డా. పల్లవి
రాయపోల్, ఆంధ్రప్రభ : వానాకాలం సాగుకు రైతులు ముందుగానే ప్రణాళికతో సిద్ధమై, శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం,సిద్దిపేట కోఆర్డినేటర్ & శాస్త్రవేత్త డా. సి.హెచ్. పల్లవి సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం రాయపోల్ గ్రామ రైతువేదికలో శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, సిద్దిపేట,వ్యవసాయ పరిశోధన స్థానం,తోర్నల సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ సందర్భంగా డా. పల్లవి మాట్లాడుతూ రైతులకు ఆరు ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు. యూరియా వినియోగాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చని, అవసరానికి మించిన రసాయనాల వినియోగం నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.పంట మార్పిడి విధానం పాటిస్తే స్థిరమైన ఆదాయం పొందవచ్చని, మార్కెట్లో లాభసాటిగా ఉన్న వరి రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సాగునీటి వినియోగంలో మితవ్యత పాటించాల్సిన అవసరం ఉందని, ప్రత్యామ్నాయ పంటలు మరియు సేంద్రీయ సాగుపై రైతులు దృష్టి సారించాలని పేర్కొన్నారు.
నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పచ్చిరొట్ట ఎరువులైన జిలుగు, జనుము, పిల్లి పెసర విత్తాలని సూచించారు. వానాకాలంలో వరి పంటను నేరుగా విత్తనాలు వెదజల్లి సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు.డా. డి. శ్వేత మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాలను వినియోగిస్తే పురుగులు, తెగుళ్లు తక్కువగా ఉండి దిగుబడులు పెరుగుతాయని చెప్పారు. మండల వ్యవసాయ అధికారి ఆర్. నరేష్ మాట్లాడుతూ రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని సాగు ఖర్చులు తగ్గించుకోవాలని, సమగ్ర వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు.
హార్టికల్చర్ అధికారి రమేష్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు లాభదాయకమని, డ్రిప్ సిస్టమ్ మరియు ఆయిల్ పామ్ మొక్కలపై ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వినియోగించుకోవాలని రైతులకు వివరించారు. కార్యక్రమంలో రైతుల సందేహాలకు శాస్త్రవేత్తలు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రజిత, స్వర్ణలత, ప్రవీణ్, సర్పంచ్ రాజు, దిశా సభ్యుడు రవీందర్ రెడ్డి మరియు సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు.
