Vijayawada | భక్తుల మనసు దోచిన ప్రత్యేక ప్రసాదం

  • ఉత్సవాల్లో ఆకర్షణగా కదంబం..
  • అల్పాహారం పరిణామం లో ఉచితంగానే
  • వేడివేడిగా ఆస్వాదించిన భక్తజనం..
  • మూడు రోజులపాటు నిర్విరామంగా ప్రసాద పంపిణీ…
  • అధికారులు, సిబ్బంది శ్రమకు భక్తుల ప్రశంసల జల్లు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి శాకంబరీ ఉత్సవాల్లో కదంబ ప్రసాదం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించిన ఉత్సవాల్లో అమ్మవారికి నివేదించిన కదంబ ప్రసాదాన్ని వేలాది మంది భక్తులకు వేడివేడిగా పంపిణీ చేశారు.

ఎంతో ప్రత్యేకం కదంబం..

ఆలయ, శాకంబరీ ఉత్సవాల సంప్రదాయానికి అనుగుణంగా ప్రత్యేక పద్ధతిలో తయారు చేసిన కదంబ ప్రసాదం రుచి, సుగంధంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు ఎంతో సంతృప్తిగా ఆరగిస్తూ, శాకంబరీ ఉత్సవాల్లో కదంబ ప్రసాదానికి ఉన్న ప్రత్యేకతను కొనియాడారు.

అల్పాహార పరిణామం లో పంపిణీ..

శాకాంబరి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ అల్పాహార వేళల్లో కదంబ ప్రసాదాన్ని నిరంతరాయంగా పంపిణీ చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు, అర్చకులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేసి ప్రసాద పంపిణీని విజయవంతంగా నిర్వహించారు. మూడు రోజులపాటు వేలాది మంది భక్తులకు కదంబ ప్రసాదాన్ని అందించేందుకు అధికారులు, వంటశాల సిబ్బంది, సేవకులు ఎంతో శ్రమించారు. వారి సేవలను భక్తులు అభినందిస్తూ, అమ్మవారి ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. శాకంబరీ ఉత్సవాల్లో ఆధ్యాత్మికతతో పాటు రుచికి ప్రతీకగా నిలిచిన కదంబ ప్రసాదం ఈసారి కూడా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.