ఉత్తర ఒడిశాలో వరదల బీభత్సం..

  • ఒడిశాను ముంచెత్తిన వరదలు…
  • ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్న నదులు
  • 11 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు

ఆంధ్రప్రభ : ఉత్తర ఒడిశాలో వరద పరిస్థితి రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతున్న వరద నీటితో ఐదు జిల్లాల్లో 1.25 లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో 10 జిల్లాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, మయూర్‌భంజ్, కేందుజార్ జిల్లాల్లోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి.

బుధబలంగా, జలకా, బైతరణి, బుధా, సాలంది నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిని దాటడంతో మరిన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు తరలించారు. అక్కడ వారికి ఆహారం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఓడ్రాఫ్), అగ్నిమాపక శాఖ బృందాలు సహాయక, సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రానున్న 24 గంటల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

11 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం..

ఒడిశాలో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 11 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం, 34 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, 38 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా బర్‌గఢ్ జిల్లాలోని బిజేపూర్‌లో 315 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతరం బలంగీర్ జిల్లా అగల్‌పూర్‌లో 264 మి.మీ., సాలేభట్టలో 256.8 మి.మీ., బర్‌పాలిలో 252 మి.మీ., గైసిలేట్‌లో 251 మి.మీ. వర్షం కురిసింది. బర్‌గఢ్, బలంగీర్, సోన్‌పూర్, సంబల్‌పూర్, కేందుజార్, అంగుల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 150 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాలతో ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ఒడిశాలో వరద పరిస్థితులు తీవ్రంగా మారాయి. బైతరణి, సాలంది నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఓడ్రాఫ్) బృందాలను రంగంలోకి దించారు. ఇదిలా ఉండగా, రానున్న 24 గంటల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

నెమ్మదిగా కదులుతున్న అల్పపీడనమే కారణం

జూలై 25న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, జూలై 26న తీవ్ర అల్పపీడనంగా మారింది. అయితే ఈ వ్యవస్థ అసాధారణంగా నెమ్మదిగా కదులుతోంది. నాలుగు రోజుల వ్యవధిలో 500 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరమే ప్రయాణించడం వల్ల ఒడిశాపై దీర్ఘకాలం పాటు భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ ఛత్తీస్‌గఢ్ వైపు గంటకు సుమారు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోందని ఐఎండీ వెల్లడించింది.