బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు
అవినీతి బయటపెట్టినందుకే వేధింపులా?
ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసిందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులు, సోదరులు, సన్నిహితులతో మాట్లాడిన అనంతరం ఈ విషయాలు తనకు తెలిసాయని తెలిపారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి గతంలో తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో ప్రస్తుత డీజీపీ సీవీ ఆనంద్ సివిల్ సప్లైస్ కమిషనర్‌గా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో సివిల్ సప్లైస్ శాఖలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, బియ్యం దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించారని పేర్కొన్నారు.
రూ.1,100 కోట్ల స్కాంపై ఫిర్యాదు చేశారన్న ఆరోపణ
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ శాఖలో రూ.1,100 కోట్ల మేర అక్రమాలు జరిగాయని పెద్ది సుదర్శన్‌రెడ్డి గుర్తించి ప్రభుత్వం, ఉన్నతాధికారులకు లేఖలు రాశారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించారని చెప్పారు.
విద్యాశాఖలో కొనుగోళ్లపై ప్రశ్నలు
పాఠశాల విద్యాశాఖలో రూ.17 వేల విలువైన బంకర్ బెడ్‌ను రూ.33 వేలకు కొనుగోలు చేశారని, ఈ కొనుగోళ్లలో కాంగ్రెస్ నాయకులు, కాంట్రాక్టర్ల ప్రమేయంతో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారని ఆరోపించారు. ఈ అంశాలను ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లారని పేర్కొన్నారు.
వేధింపులకు గురిచేశారన్న ఆరోపణ
ఈ వ్యవహారాల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అందులో భాగంగానే ఆయనకు ఉన్న ఆయుధ లైసెన్స్‌ను రద్దు చేసి, వివిధ రకాలుగా వేధింపులకు గురిచేశారని విమర్శించారు.
