ఎల్‌నినోను ఎదుర్కొందాం.. ఉద్యాన రైతులకు కలెక్టర్ సూచనలు
తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో ఉద్యాన రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో ఉద్యాన శాఖ రూపొందించిన ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించే చర్యలు, జాగ్రత్తలకు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను బుధవారం కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తొలి వర్షాలను సద్వినియోగం చేసుకునేలా ముందస్తు విత్తనం చేపట్టాలని అధికారులు తెలిపారు.
వ్యవసాయ కుంటలు ఏర్పాటు చేసుకోవాలి
వర్షపు నీటిని నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో పంటలకు జీవరక్షక నీటిపారుదల అందించేందుకు వ్యవసాయ కుంటలు (ఫార్మ్పాండ్లు) ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీడ్ మ్యాట్, మల్చింగ్ విధానాలను అనుసరించడం ద్వారా నేలలో తేమను సంరక్షించడంతో పాటు కలుపు మొక్కలను నియంత్రించి, నీటి ఆవిరిని తగ్గించి పంటల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని వివరించారు. బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ద్వారా నీటిని సమర్థవంతంగా వినియోగించి 30 నుంచి 60 శాతం వరకు నీటిని ఆదా చేయడంతో పాటు పంట దిగుబడి, నాణ్యతను పెంచుకోవచ్చని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు.
పంటల బీమాలో నమోదు తప్పనిసరి
వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ పొందేందుకు అర్హులైన రైతులు తప్పనిసరిగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి తెలిపారు. రైతులు తమ సమీప ఉద్యాన అధికారి లేదా రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే)ను సంప్రదించి శాఖ అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు. ఈ సందర్భంగా “ముందస్తు చర్యలు తీసుకుందాం.. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గిద్దాం.. ఉద్యాన పంటలను కాపాడుకుందాం” అనే నినాదంతో రైతులను చైతన్యపరిచారు.
