పోలీస్ కుటుంబాల పిల్లల ప్రతిభకు గుర్తింపు

  • క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు
  • తల్లిదండ్రులే పిల్లలకు తొలి రోల్ మోడల్స్
  • అర్హులందరికీ వెల్ఫేర్ ద్వారా సహాయం: ఎస్పీ
  • మెరిట్ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులకు సత్కారం

తిరుపతి బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, అభినందన పత్రాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని స్కాలర్‌షిప్‌లు అందజేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అభినందించారు. క్రమశిక్షణ, కృషి, సరైన మార్గదర్శకత్వంతో ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తల్లిదండ్రులే పిల్లలకు తొలి రోల్ మోడల్స్ అని అన్నారు. పోలీస్ ఉద్యోగులు విధి నిర్వహణలో పాటించే క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యత పిల్లల వ్యక్తిత్వ వికాసానికి బలమైన పునాది అవుతాయని తెలిపారు.

ఒత్తిడి తీసుకురావొద్దు..

పిల్లలపై అధిక ఒత్తిడి తీసుకురావడం కంటే వారి ఆసక్తి, సామర్థ్యం, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత అని ఎస్పీ అన్నారు. సమయపాలన, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. పోలీస్ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రతి సంవత్సరం ఐఐటీ, జేఈఈ, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యా రంగాల్లోనే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌సీలో 26 మంది, ఇంటర్మీడియట్‌లో 18 మంది, జేఈఈ అడ్వాన్స్డ్‌లో ఇద్దరు, జేఈఈ మెయిన్స్‌లో ఒకరు, ఈఏపీసెట్‌లో ఒకరు, బీటెక్, ఎంబీబీఎస్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ, బీసీఏ, బీపీటీ, బీఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేశారు.

ప్రతిభ ఆధారంగా సహాయం..

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరేసి పిల్లలు మెరిట్ స్కాలర్‌షిప్‌లు సాధించిన తొమ్మిది కుటుంబాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సాంకేతిక కారణాలతో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయలేకపోయిన అర్హులైన విద్యార్థులకు కూడా పోలీస్ వెల్ఫేర్ విభాగం ద్వారా వారి ప్రతిభ ఆధారంగా తగిన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహర ఆచారి, ఐ.రామకృష్ణ, శ్రీనివాసరావు, ఏవో సురేష్ కుమార్‌తో పాటు పలువురు డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, పోలీస్ వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది, మెరిట్ సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.