Pawan-Kalyan-Greets : పులుల పాత్ర అమోఘం Andhra Prabha Top News
Pawan-Kalyan-Greets : పులుల పాత్ర అమోఘం Andhra Prabha Top News
- పులుల సంరక్షణలో
- ఏపీ దేశానికే ఆదర్శం
- తూర్పు కనుమల్లో పులుల పునరుజ్జీవం వైపు అడుగులు
- నల్లమలలో పులి గర్జన శాశ్వతం
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
( ఆంధ్రప్రభ, అమరావతి)
Pawan-Kalyan-Greets : పులి కేవలం జాతీయ జంతువు మాత్రమే కాదు, దేశ అటవీ సంపదకు, జీవ వైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు ప్రతీక అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన మనో భావాలను పంచుకున్నారు.
పులులను సంరక్షించడం అంటే మన అడవులను, జల వనరులను, వన్యప్రాణులను, భావితరాలకు అందించాల్సిన సహజ వారసత్వాన్ని కాపాడుకోవడమే. ప్రపంచ పులుల దినోత్సవం… 2010లో పులుల సంరక్షణ కోసం అంతర్జాతీయ సమాజం తీసుకున్న సంకల్పాన్ని మనకు గుర్తు చేస్తుంది. అదే సమయంలో పులుల పరిరక్షణలో మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన తీరును గుర్తు చేస్తుంది. “ప్రాజెక్ట్ టైగర్” వంటి దూరదృష్టితో కూడిన కార్యక్రమాల ఫలితంగా నేడు ప్రపంచంలోని పులులలో దాదాపు 75 శాతం మన దేశంలో నివసిస్తున్నాయి. ఇది భారతదేశం సాధించిన అపూర్వ పర్యావరణ విజయానికి నిదర్శనం.
దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం మనందరికీ గర్వకారణం. నల్లమల అటవీ ప్రాంతంలో 5,442.83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ రిజర్వ్- పులులతోపాటు చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, శాకాహార జంతువులు మరియు వందలాది వన్యప్రాణులకు సురక్షిత ఆవాసంగా నిలుస్తోంది. తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని NSTR–శేషాచలం పరిధిలో 68 పులులు, 11 పులి పిల్లలు నమోదుకావడం సంతోషకర విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ చర్యలకు నిదర్శనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పులుల సంరక్షణ కోసం అనేక శాస్త్రీయ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. వేట నిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు గడ్డి మైదానాల అభివృద్ధి, వేట జంతువుల సంఖ్య పెంపు వంటి చర్యలను చేపట్టాం. డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లు, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా అటవీ ప్రాంతాల నిఘాను మరింత సమర్థంగా నిర్వహిస్తున్నాం. అటవీ శాఖ సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం. NSTR టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11 చెక్‌పోస్టులు నెలకు రూ. కోటికి పైగా ఆదాయం సమకూరుస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇది సంరక్షణతోపాటు స్థానిక అభివృద్ధికి దోహదపడుతోంది. తూర్పు కనుమల ప్రాంతంలో పులుల జన్యు వైవిధ్యాన్ని, జనాభాను పెంపొందించేందుకు మహారాష్ట్రలోని చంద్రపూర్ అటవీ పరిధి నుంచి రెండు ఆడ పులులను, మధ్యప్రదేశ్ నుంచి మరో రెండు ఆడ పులులను తీసుకురావడానికి సూత్రప్రాయ అంగీకారం లభించడానికి సహకరించిన కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పులుల సంరక్షణ చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. అలాగే నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో వేట నిరోధక శిబిరాల సంఖ్యను 89 నుంచి 150కు పెంచుతున్నాము. దీనివల్ల భద్రత, నిఘా, సమాచార సేకరణ, అత్యవసర స్పందన సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయి. అదే సమయంలో సుమారు 800 మంది గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి నిబద్ధతతో పనిచేస్తోంది. నల్లమల అడవుల్లో గౌర్ జంతువుల పునఃప్రవేశం, పాపికొండ అటవీ ప్రాంతంలో ఆడ పులుల ప్రవేశం, వన్యప్రాణి కారిడార్ల పరిరక్షణ వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. నల్లమల అడవుల్లో పులి గర్జన శాశ్వతంగా వినిపించే లక్ష్యంతో మనమందరం కృషి చేయాలని పిలుపునిస్తున్నాను. ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి, వన్యప్రాణి సంరక్షకులకు, శాస్త్రవేత్తలకు, పర్యావరణ ప్రేమికులకు, అడవుల పరిరక్షణలో భాగస్వాములైన గిరిజన సమాజాలకు మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ అడవులను, వన్యప్రాణులను కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి అటవీ శాఖ అధికారికీ, సిబ్బందికి డిప్యూటీ సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
