లేబుల్ లేని ఆహారంపై కొరడా

  • తిరుపతి బస్టాండ్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు

తిరుపతి సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ: నగరంలోని ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌లో ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌లోని పలు తినుబండారాల దుకాణాల్లో తయారీదారు వివరాలు, తయారీ తేదీ, గడువు తేదీ (ఎక్స్‌పైరీ డేట్) వంటి తప్పనిసరి లేబుల్ వివరాలు లేకుండా విక్రయిస్తున్న చిప్స్‌తో పాటు ఇతర ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను గుర్తించారు. ఈ విషయాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత దుకాణాల యజమానులపై మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులను జిల్లా జాయింట్ కలెక్టర్ విచారించి చట్టప్రకారం జరిమానాలు విధించనున్నారు. ఇకపై లేబుల్ వివరాలు లేని ఆహార ప్యాకెట్లను విక్రయిస్తే ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం నిల్వలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.

తరచుగా తనిఖీలు..

ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రాంగణంలోని ఆహార విక్రయశాలలను ప్రతిరోజూ తనిఖీ చేయాలని రవాణా సంస్థ అధికారులను కోరారు. ప్రజలు ఆహార ప్యాకెట్లు కొనుగోలు చేసే ముందు తయారీదారు వివరాలు, తయారీ తేదీ, గడువు తేదీ వంటి లేబుల్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించి, నాణ్యమైన ఆహార పదార్థాలనే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జి.వెంకటేశ్వర్ రావు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆర్.జగదీష్, కె.నర్మద, ఏపీఎస్‌ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ సంధ్య, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు రాజారెడ్డి పాల్గొన్నారు.