మంత్రి నారా లోకేష్‌కు నాయి బ్రాహ్మణ సంఘం వినతి

పాయకాపురం, ఆంధ్రప్రభ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు బుధవారం కలిసి పలు సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ రక్షణ చట్టాన్ని అమల్లోకి తేవాలని, రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణ సెలూన్ షాపులకు 200 యూనిట్ల విద్యుత్ సబ్సిడీ మినహాయించి, మిగిలిన యూనిట్లకే విద్యుత్ బిల్లు విధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే రాష్ట్రంలోని సెలూన్ షాపులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, నాయి బ్రాహ్మణ కులదైవమైన ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ఇతర కులాలకు చెందిన వారు నాయి బ్రాహ్మణ వృత్తిలోకి వచ్చి సెలూన్ షాపులు నిర్వహించడం వల్ల నాయి బ్రాహ్మణులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని, నాయి బ్రాహ్మణ కులవృత్తిని నాయి బ్రాహ్మణులకే పరిమితం చేసేలా జీవో జారీ చేసి చట్టబద్ధం చేయాలని వినతిపత్రంలో కోరారు.