విమానాశ్రయం, ఈఎస్ఐ ఆసుపత్రి సాధిస్తాం: ఎంపీ వంశీకృష్ణ

గోదావరిఖని, ఆంధ్రప్రభ : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అంతర్గాం ప్రాంతంలో విమానాశ్రయం, రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటును బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు.

శనివారం సాయంత్రం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానాశ్రయం ఏర్పాటును కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కూడా ఆటంకాలు కల్పిస్తున్నప్పటికీ పోరాటం చేసి ఆసుపత్రిని సాధించి తీరుతామని స్పష్టం చేశారు.

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.10 వేల పెన్షన్ అందించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో కొత్త గనులను సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2ను సింగరేణికి కేటాయించడం ద్వారా సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ ప్రాంతానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పెద్దపల్లి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

అయోధ్యలో రూ.250 కోట్ల విలువైన బంగారు ఆభరణాల చోరీ జరిగిందనే అంశంపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, పిల్లి మల్లికార్జున్, తొగరి తిరుపతి, దుబాసు మల్లేష్, విజయ్, కోటేశ్వర్లు, అనుమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.