బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం

ఓటర్ల జాబితాపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి: బీజేపీ నాయకులు

కుంటాల, ఆంధ్రప్రభ : బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏలు) గుర్తింపు కార్డులను బీజేపీ నాయకులు శనివారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతంలో బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అనర్హుల పేర్ల తొలగింపు విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

ఓటర్ల జాబితాకు సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా అభ్యంతరాలు తలెత్తితే వెంటనే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. బూత్ స్థాయిలో సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని, ప్రతి బీఎల్‌ఏ బాధ్యతాయుతంగా వ్యవహరించి భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట రవి, బీజేపీ మండల అధ్యక్షుడు పసుల నవీన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాదు ప్రభాకర్, పార్టీ నాయకులు భోగ గోవర్ధన్, తాటి శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.