వంతెనల కోసం దశాబ్దాల నిరీక్షణ..

  • వర్షాకాలంలో బెల్లంపల్లి గ్రామాల దుర్భర జీవనం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజలు ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులపై వంతెనలు లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో హై లెవెల్ బ్రిడ్జిలు లేకపోవడంతో గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. నియోజకవర్గంలోని తాండూర్, వేమనపల్లి, కన్నెపల్లి, భీమిని, నెన్నెల, కాసిపేట, బెల్లంపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ప్రతి వర్షాకాలంలో వాగులు ఉప్పొంగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా, అధికార యంత్రాంగం మారినా ఈ గ్రామాల పరిస్థితి మాత్రం మారలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ సమస్యలపై ఇప్పటివరకు స్పందించలేదని, మండల ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల పరిస్థితిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

నర్సాపూర్‌లో భీమన్న వాగుపై హై లెవెల్ వంతెన లేక ఇక్కట్లు

అంబులెన్స్ వచ్చే దారి లేక గర్భిణి నరకయాతన

గత ఏడాది నర్సాపూర్ గ్రామానికి చెందిన ఓ గర్భిణీ మహిళకు ప్రసవ వేదనలు రావడంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే భీమన్న వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆమె వాగు ఒడ్డునే ప్రసవ వేదనతో నిరీక్షించాల్సి వచ్చింది. అంబులెన్స్ వచ్చే అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు పోలీసుల సహకారంతో ఆమెను వాగు దాటించారు.

తాండూర్ మండలం నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని భీమన్న వాగు ప్రతి వర్షాకాలంలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో నర్సాపూర్‌తో పాటు బెజ్జాల, ఆసలమాడ, దొడ్డిగూడ, లచ్చుగూడ గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోతాయి. గత ఏడాది భీమన్న వాగుపై వంతెన నిర్మించాలని తుడుం దెబ్బ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టినా అధికారులు స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి.

స్వయంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ వరద సమయంలో పరిశీలించినప్పటికీ ఏడాది గడిచినా వంతెన నిర్మాణం ప్రారంభం కాలేదు. ఇద్దరు ఐఏఎస్ అధికారులు పరిశీలించినా, గిరిజనులు ఉద్యమించినా పాలకులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. భీమన్న వాగు కారణంగా దాదాపు 1,200 మంది ప్రజలు ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వేమనపల్లి మండలంలో…

మండలంలో ప్రాణహిత నది ఉప్పొంగితే మండల కేంద్రం వరద నీటితో నిండిపోతుంది. అంతేకాకుండా నీల్వాయి వాగు, లంబాడి తండా, బయ్యారం, సంపుటం, రాజారం, గొల్లవాగు, జాజులపేట గ్రామాల్లో వాగులపై వంతెనలు లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ప్రజలు పడవ ప్రయాణమే ఆధారంగా మారుతోంది. ఇటు మంచిర్యాల జిల్లా, అటు మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న వేమనపల్లి మండలంలో ఇప్పటికీ పూర్వకాలం నాటి పరిస్థితులే కొనసాగుతున్నాయి.

నల్లవాగు వరదతో ఏటా తప్పని తిప్పలు

కన్నెపల్లి మండలంలోని ఎర్రవాగు వర్షాకాలంలో ఉప్పొంగి ప్రవహించడంతో అటు జజ్జరవెల్లి, ఇటు దుబ్బగూడ, వీరాపూర్ గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోతుంటాయి. వంతెన నిర్మించాలని పలుమార్లు కోరినా పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. నల్లవాగు వరద ఉధృతి కారణంగా రోడ్లు కోతకు గురై రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారుతున్నాయి.

భీమిని మండలంలో ఎర్రవాగుతో…

జిల్లాలోని మారుమూల మండలమైన భీమినిలో ఇప్పటికీ వరద సమస్య కొనసాగుతోంది. తంగళ్లపల్లి, సూర్యాపూర్ గ్రామాల వద్ద ఎర్రవాగు ఉగ్రరూపం దాలిస్తే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం కూడా కష్టంగా మారుతోంది. వాగు గ్రామాల చుట్టూ ప్రవహించడంతో వర్షాకాలంలో ఈ గ్రామాలు ద్వీపాలను తలపిస్తాయి. ఎర్రవాగుపై ప్రభుత్వం వంతెన నిర్మించకపోవడంతో ఈ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎర్రవాగుపై వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే స్పందించి సత్వర చర్యలు తీసుకుంటేనే ఈ గ్రామాలు వరద ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించాలని కోరుతున్నారు.

కర్జివాగుతో నాలుగు గ్రామాలకు తప్పని ముప్పు

నెన్నెల మండలంలోని మారుమూల గ్రామాల సమీపంలో ఉన్న కర్జివాగు ప్రతి వర్షాకాలంలో ఉప్పొంగి ప్రవహించడంతో నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించకపోవడంతో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఇదే దుస్థితి కొనసాగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్జివాగు కారణంగా దమ్మిరెడ్డిపల్లి, పంగిడి, సోమవారం, శంకర్‌పూర్, కర్జి గ్రామాల ప్రజలు ప్రతి ఏటా వరద ముప్పును ఎదుర్కొంటున్నారు. కర్జివాగుపై వంతెన నిర్మిస్తే చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలోని మారుమూల గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు ముంపు సమస్య తగ్గే అవకాశం ఉంది.

బెల్లంపల్లి మండలంలో పాలవాగుపై వంతెన లేక…

బెల్లంపల్లి మండలంలోని ఆకనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పాలవాగుపై వంతెన లేకపోవడంతో నారవాయిపేట గ్రామానికి రాకపోకలు నిలిచిపోతుంటాయి. వ్యవసాయ భూములు రెండు మండలాలకు చెందినవి కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలవాగు ఉప్పొంగితే పంట పొలాలు ముంపునకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా పశువుల కాపర్లు కూడా వరద తగ్గే వరకు రాత్రింబవళ్లు నిరీక్షించాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి.