ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం అమలుపై కలెక్టర్ సీరియస్
గతేడాది నిధులు, లబ్ధిదారుల పూర్తి వివరాలు సమర్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశం
కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లాలో గత ఏడాది అమలు చేసిన జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) పథకం అమలుపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. గత ఏడాది పథకం కింద మంజూరైన నిధులు, లబ్ధి పొందిన రైతుల వివరాలను మండలాల వారీగా సిద్ధం చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రభ ప్రతినిధి గత ఏడాది ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం పథకంలో అనర్హులకు కూడా నిధులు మంజూరయ్యాయనే ఆరోపణలు ఉన్నాయని, ఈ ఏడాదైనా అర్హులైన ప్రతి రైతుకు పథకం ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.
దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మికి కీలక ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం పథకం అమలు విధానం, మండలాల వారీగా మంజూరైన నిధులు, లబ్ధిదారుల సంఖ్య, పూర్తి లబ్ధిదారుల జాబితా, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి అందించాలని సూచించారు.
ఈ ఏడాది పథకం అమలులో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం అందించే ప్రయోజనాలు చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హత కలిగిన ఒక్క రైతు కూడా పథకానికి దూరం కాకుండా చూడాలని, ఎంపిక ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ గత ఏడాది అమలుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పరిశీలించి అవసరమైతే సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి కోరిన సమాచారాన్ని త్వరితగతిన సిద్ధం చేసి అందజేస్తామని వెల్లడించారు.
