వియత్నంలో విషాదం.. మచిలీపట్నం దంపతులు మృతి

ఫు క్వాక్ సమీపంలో పర్యాటక స్పీడ్‌బోట్ బోల్తా.. విషాదాంతమైన విదేశీ పర్యటన

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: వియత్నంలో జరిగిన ఘోర పర్యాటక బోటు ప్రమాదంలో మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిషోర్, ఆయన సతీమణి గెల్లి జయశ్రీ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన మచిలీపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

లావా సెల్ కంపెనీ తమ వ్యాపార భాగస్వాములు, డీలర్ల కోసం ఏర్పాటు చేసిన విదేశీ పర్యటనలో భాగంగా గెల్లి దంపతులు వియత్నం వెళ్లినట్లు తెలిసింది. జూలై 11న వియత్నంలోని ఫు క్వాక్ ప్రాంతంలోని ఆన్ థోయ్ ద్వీపసమూహం సమీపంలోని హోన్ మే రుట్ వద్ద పర్యాటకులతో విహారయాత్రకు బయలుదేరిన స్పీడ్‌బోట్ ప్రమాదానికి గురైంది. సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో బలమైన గాలులు, ఎత్తైన అలల ధాటికి బోటు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో ఉన్న పలువురు నీటిలో చిక్కుకోగా, సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

వియత్నం ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన యాత్రికులు సహా మొత్తం 32 మంది మృతి చెందినట్లు వియత్నం ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించినట్లు సమాచారం. మృతుల్లో మచిలీపట్నానికి చెందిన గెల్లి కిషోర్, జయశ్రీ దంపతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ఒకేసారి మృతి చెందడంతో మచిలీపట్నం విషాదంలో మునిగిపోయింది. గెల్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే స్థానిక వ్యాపార వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. గెల్లి కిషోర్ మచిలీపట్నంలో టాటా ఇండికాం, టాటా సెల్యులర్ డీలర్‌గా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం. వియత్నంలోని భారత రాయబార కార్యాలయం అక్కడి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేస్తూ అవసరమైన ప్రక్రియలను పూర్తి చేస్తోంది. మృతదేహాలను ప్రత్యేక విమానం ద్వారా ఆయా రాష్ట్రాలకు తరలించి, అక్కడి నుంచి స్వగ్రామాలకు చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో గెల్లి దంపతుల మృతదేహాలు మచిలీపట్నానికి చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ విషాద ఘటనపై మచిలీపట్నంలోని ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గెల్లి కిషోర్, జయశ్రీ దంపతుల మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.