NEWS@7:00 P.M | 11 జూలై 2026 ముఖ్యాంశాలు
షాబాద్ నిందితుడి కోసం పోలీసుల ప్రకటన
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించగా, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. ప్రత్యేక పోలీసు బృందాలు పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు కొనసాగిస్తుండగా, రాజ్‌కుమార్‌కు సంబంధించిన విశ్వసనీయ సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్ రాజీనామా చేయాలి…
షాబాద్‌లో ఆరు హత్యల ఘటనపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందిస్తూ, ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. ఎస్‌ఐని సస్పెండ్ చేయడం సరిపోదని, ప్రధాన నిందితుడిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేకపోవడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. మానవత్వం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
నాన్‌వెజ్ ప్రియులకు షాక్
తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులపై భారం పడింది. బ్రాయిలర్ చికెన్ కిలో రూ.290, స్కిన్‌లెస్ రూ.320, బోన్‌లెస్ రూ.380–400కు చేరగా, రిటైల్‌లో ఒక్క కోడిగుడ్డు రూ.8కు విక్రయిస్తున్నారు. వర్షాకాల ప్రభావంతో ఉత్పత్తి తగ్గడం, కోళ్ల దాణా, రవాణా ఖర్చులు పెరగడం వల్ల ధరలు ఎగబాకాయని పౌల్ట్రీ వ్యాపారులు తెలిపారు. ధరల పెరుగుదలతో చికెన్ విక్రయాలు సుమారు 30 శాతం తగ్గాయని, మరో రెండు నెలలు ధరలు అధికంగానే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు పార్టీ మారతారన్న ప్రచారాన్ని కేటీఆర్ ఖండిస్తూ, ఆయన కేసీఆర్‌కు అత్యంత నమ్మకమైన నాయకుడని స్పష్టం చేశారు. హరీశ్ రావుపై వస్తున్న పుకార్లను ఆయన ఇప్పటికే పలుమార్లు ఖండించారని, బీఆర్‌ఎస్ శ్రేణులు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేస్తూ, పార్టీలు మారిన చరిత్ర ఉన్న ఆయన ఇతరుల రాజకీయ నిబద్ధతపై మాట్లాడడం సరికాదన్నారు. తమ పార్టీ నాయకులు ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లోనుకాబోరని స్పష్టం చేశారు.
ప్రమోద యాత్రలో.. పెను విషాదం..
వియత్నాంలో ఓ మొబైల్ కంపెనీ నిర్వహించిన విహారయాత్ర విషాదంగా మారింది. అమ్మకాల లక్ష్యాలను అధిగమించిన డిస్ట్రిబ్యూటర్ల కోసం ఏర్పాటు చేసిన టూర్‌లో ఫు క్వాక్ ద్వీపం సమీపంలో స్పీడ్‌బోటు బోల్తాపడగా, పలువురు సముద్రంలో మునిగిపోయారు. మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో 18 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తుండగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు బాధితులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంలో కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ మృతి చెందినట్లు సమాచారం. 23 మందిని రక్షించగా, మరికొందరి కోసం వియత్నాం కోస్ట్ గార్డ్ గాలింపు కొనసాగిస్తోంది. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తోంది.
