ఎండల ప్రభావం – పౌల్ట్రీపై భారీ దెబ్బ
ఎండల ప్రభావం – పౌల్ట్రీపై భారీ దెబ్బ
సిద్దిపేట అర్భన్, ఆంధ్రప్రభ : వ్యవసాయ అనుబంధ రంగమైన పౌల్ట్రీకి వడదెబ్బ తగిలింది. చలి, వర్షాకాలంలో లాభాల బాటలో నడిచే ఈ రంగానికి వేసవి గడ్డుకాలంగా మారుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా భారీగా ఉత్పత్తి తగ్గుతోంది. ప్రతి ఏడాది ఎండాకాలంలో వడదెబ్బకు గురై 40 నుంచి 70 శాతం వరకు కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
ఈసారి ఎండలు క్రమంగా ముదురుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకోవడంతో పౌల్ట్రీ రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, నీటి వనరుల లేమి కారణంగా వ్యాధులు ప్రభలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా పౌల్ట్రీ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్పులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముంది. వర్షాభావం కారణంగా ఇప్పటికే ఎండిపోయిన బోర్లు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. ఫలితంగా కోళ్ల పెంపకం క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.
కోళ్లలో కాళ్ల బలహీనత
వేసవిలో కోళ్లలో కాళ్ల బలహీనత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కాల్షియం, ఫాస్పరస్ స్థాయిలను సరైన మోతాదులో అందించడం అవసరం. లేయర్ కోళ్లకు 3.75–4.00 శాతం కాల్షియం, 0.45 శాతం నీటిలో కరిగే ఫాస్పరస్ ఉండేలా చూడాలి. బ్రాయిలర్ కోళ్లకు 1 శాతం కాల్షియం, 0.45 శాతం ఫాస్పరస్ అందించాలి. వేసవిలో టాక్సిన్ సమస్యను తగ్గించడానికి టాక్సిన్ బైండర్లు వాడడం మంచిది.
వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు
ఫాగర్లు వాడేటప్పుడు తడి ఎక్కువగా ఉండి దాణా అట్టలు కట్టే సమస్యలు రావచ్చు. దాణా ద్వారా ఇచ్చే ఏ, బి2, డి, కె విటమిన్లను కొంత ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల కోళ్లను ఒత్తిడికి గురి కాకుండా కాపాడవచ్చు. బి-కాంప్లెక్స్ విటమిన్లను క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వడదెబ్బ నివారణకు చాలామంది రైతులు ఫాగర్లపై ఆధారపడుతుంటారు. అయితే గాలిలో తేమ శాతం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటిన తర్వాతే ఫాగర్లను ఉపయోగించాలి. వాటిని ఎంతసేపు, ఎలా వాడాలి అనే విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.
