నెమలి దేవస్థాన చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి…

నెమలి దేవస్థాన చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి…

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును కలిసిన బీసీ నాయకులు
గౌడ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ విజ్ఞప్తి..

తిరువూరు, ఆంధ్రప్రభ : నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవిని బీసీ వర్గాలకు కేటాయించాలని కోరుతూ బీసీ నాయకులు కొలికపూడి శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడంప్రాధాన్యత సంతరించుకుంది. తిరువూరు నియోజకవర్గంలో జరిగిన ఈ భేటీలో… దేవస్థానం చైర్మన్ పదవి స్థానికంగా సేవలందించిన బీసీలకు, ముఖ్యంగా గౌడ వర్గానికి ఇవ్వాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే… ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. మంత్రి స్థాయిలో కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్లు, ప్రభుత్వం దీనిపై సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా ఈసారి దేవస్థానం చైర్మన్ పదవిని బీసీ వర్గాలకు కేటాయించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని హామీ ఇచ్చారు.

ఈ నిర్ణయం అమలులోకి వస్తే… సామాజిక న్యాయ సాధనకు దోహదం చేస్తుందని, స్థానిక బీసీ వర్గాల ఆశలు నెరవేరుతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.