మీడియా, సోషల్ మీడియాపై మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదు..

మీడియా, సోషల్ మీడియాపై మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదు..
- వైసీపీ పాలనలో అరాచకాలు, దాడులు, బెదిరింపులే…
- ధర్మపాలనను చూసి జీర్ణించుకోలేకపోతున్న జగన్
- పోలీసులపై ఆరోపణలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలి
- తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న..
భవానిపురం, ఆంధ్రప్రభ ; మీడియా సోషల్ మీడియా పై మాట్లాడే నైతిక హక్కు జగన్ కు ఎక్కడ ఉందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియా, పోలీసు వ్యవస్థ పై మాట్లాడే అర్హత. వైసీపీ పాలనలో సోషల్ మీడియా పేరుతో వ్యక్తిగత దూషణలు, అసభ్యకర పోస్టులు, రాజకీయ ప్రత్యర్థులపై లక్ష్యబద్ధ దాడులు జరిగాయని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియాపై స్వయంగా కుటుంబ సభ్యులే ఫిర్యాదులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్‌తో విభేదించిన వారిని, కుటుంబ సభ్యులను సైతం వదల్లేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఐదేళ్లపాటు రూల్ ఆఫ్ లాను పక్కనబెట్టి పాలన సాగిందని, ప్రజల సమస్యలపై స్పందించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు, అనుచరులపై దాడులు జరిగాయని, అనేక కేసుల్లో రాజకీయ కక్షసాధింపు కనిపించిందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలను ప్రోత్సహించిన జగన్, ఇప్పుడు లా అండ్ ఆర్డర్, సోషల్ మీడియా గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో చట్టపరమైన పాలన కొనసాగుతోందని, అదే కొందరికి అసహనంగా మారిందని వ్యాఖ్యానించారు.
పోలీసు వ్యవస్థపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని, గతంలో జరిగిన ఘటనలపై ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని జగన్‌కు సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హింస, ద్వేష ప్రచారం, వ్యక్తిగత దూషణలకు స్థానం ఉండదని, అలాంటి రాజకీయ సంస్కృతిని ప్రజలే తిరస్కరించారని ఆయన అన్నారు.
