పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యతనివ్వాలి

పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యతనివ్వాలి

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ తన కార్యాలయం నుండి జూమ్ ద్వారా నిర్వహించారు.

సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులపై సమీక్షిస్తూ, ఏప్రిల్ 15 నుండి 22 వరకు వచ్చిన 18 దరఖాస్తుల్లో 12 పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్ ఆరా తీశారు. ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలి,, లీగల్ మెట్రాలజీ విభాగాల్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు . పలాసలో 75 శాతం పార్కు పనులు పూర్తయిన నేపథ్యంలో, మే నెలలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని, అలాగే శ్రీకాకుళం పాతృనివలసలో జూన్ నాటికి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులకు ఏప్రిల్ నెలాఖరులోగా శంకుస్థాపనలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పైడి భీమవరంలో 91 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన శానిటేషన్ పనులను త్వరితగతిన ముగించాలని ఆదేశించారు. జిల్లాలో భారీ పెట్టుబడులకు ముందుకు వస్తున్న కంపెనీలకు భూమి అవసరాలను కలెక్టర్ సమీక్షించారు. పీఎం విశ్వకర్మ యోజన కింద జిల్లాలో ఇప్పటివరకు 79,941 దరఖాస్తులు అందాయని, ఇందులో 4,977 మందికి టూల్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

అర్హులైన మిగిలిన కళాకారులకు త్వరితగతిన శిక్షణ పూర్తి చేసి రుణాలు అందేలా చూడాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, గనులు – భూగర్భ శాఖ, వాణిజ్య పన్నులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply