ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖప్రసవం

ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖప్రసవం

ఎ. కొండూరులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ఎ. కొండూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ వైద్యసేవలపై విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరో సుఖప్రసవం విజయవంతంగా నిర్వహించారు. మండలంలోని అట్లప్రగడ గ్రామానికి చెందిన వేంపాటి కావ్యకు ప్రసవ వేదనలు ప్రారంభమవడంతో ఆమె భర్త బాలయ్య సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే విధుల్లోఉన్న వైద్యురాలు డా.పి.దివ్య రోగిని పరీక్షించి అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించారు.

తల్లి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి సురక్షిత ప్రసవానికి తక్షణ చర్యలు చేపట్టారు. వైద్య సిబ్బంది సమన్వయంతో కొద్దిసేపటికే కావ్యకు సుఖప్రసవం జరిపి పండంటి మగబిడ్డ జన్మించిందని తెలిపారు. ప్రసవానికి ముందు, తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే ఉచిత సేవలు, సౌకర్యాల గురించి వివరించారు. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యురాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు ప్రభుత్వ వైద్యశాలలను ఆశ్రయించడం ద్వారా సురక్షిత ప్రసవాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ మస్తాన్ బీ తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.