ప్రతి షాదీఖానా వెనుక చంద్రబాబు ముద్ర.. ఉర్దూ భాషకు పెద్దపీట

  • ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారుఖ్ షుబ్లీ
  • ఘనంగా ఉర్దూ ఘర్ కం షాదీఖానా నూతన కమిటీ అభినందన సభ

చల్లపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ప్రతి షాదీఖానా నిర్మించిన ఘనత చంద్రబాబుదే అని ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారుఖ్ షుబ్లీ అన్నారు. చల్లపల్లిలోని షాదీఖానాలో ఉర్దూ ఘర్ కం షాదీఖానా నూతన కమిటీ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫారూఖ్ షుబ్లీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండున్నర దశాబ్దాల క్రితమే ముస్లింల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఉన్న ప్రతి గ్రామంలో ఉర్దూఘర్ కం షాదీఖానాలు మంజూరు చేసి నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తింపు ఇచ్చిన చంద్రబాబు ఉర్దూ భాషను నిలబెట్టారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గచ్చిబౌలిలో దేశంలోనే తొలి ఉర్దూ యూనివర్సిటీ అబ్దుల్ కలాం పేరుతో స్థాపించిన చంద్రబాబు నవ్యాంధ్రలో కర్నూలులో అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 1,346 ఉర్దూ పాఠశాలలు నిర్మించిన ఘనత, ప్రత్యేకంగా ఉర్దూ డిఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

ఉర్దూ పాఠశాలలను మూసివేసిన ఘనత వైసీపీది..

ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉర్దూ ఉపాధ్యాయుడు ఆయన నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారే అని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 50 ఉర్దూ పాఠశాలలు మూత వేసిన ఘనత స్వంతం చేసుకుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 36 ఉర్దూ గ్రంథాలయాలు, ఉర్దూ కంప్యూటర్ సెంటర్లకు కనీస నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు కంప్యూటర్ సెంటర్లు గ్రంధాలయాల సిబ్బందికి ప్రతి నెల వేతనాలు సకాలంలో చెల్లిస్తూ, నూతన కంప్యూటర్లు కూడా సమకూర్చారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, ముస్లిం సమాజ సంక్షేమానికి, ఉర్దూ భాష అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముస్లింలు అండగా నిలవాలని ఫారూఖ్ షుబ్లీ పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిం సోదరులు కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. షాదీఖానా నిర్వహణ బాధ్యత చేపట్టిన నూతన కమిటీ ప్రతినిధులు సమర్థవంతంగా నిర్వహించి ముస్లిం సమాజానికి మేలు చేయాలని పిలుపునిచ్చారు.

ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమానికి మొదటి నుంచి చంద్రబాబు విశేష కృషి చేశారన్నారు. గతంలోనే దుకాన్-మకాన్ పథకం ప్రవేశపెట్టి వారికి జీవనోపాధి కల్పించారన్నారు. నిరుపేద ముస్లిం యువతుల వివాహానికి దులహన్ పథకం ద్వారా మేలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ హషీం బేగ్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి ముస్లింల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి వివరించారు.

నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ.. 2000లో టీడీపీ ప్రభుత్వం కేటాయించిన రూ.7.50లక్షలు, ఎంపీ ఉమ్మారెడ్డి నిధులు రూ.3.50లక్షలు, ఎంపీ కొనకళ్ళ నారాయణ నిధులు రూ.2.50లక్షలతో నిర్మితమైన ఈ షాదీఖానా నిర్మాణం అసంపూర్తిగా ఉన్న విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ 2018లో ఎస్.డీ.ఎఫ్ నిధులు రూ.10లక్షలు కేటాయించి మిగిలిన పనులన్నీ పూర్తి చేయించి, షాదీఖానాను వినియోగంలోకి తెచ్చారన్నారు. అవనిగడ్డలోని షాదీఖానా పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చాలని ఫారూఖ్ షుబ్లీకి విన్నవించారు. ఈ మేరకు అవనిగడ్డ ముస్లిం సోదరులు షుబ్లీకి వెంకట్రామ్ సమక్షంలో వినతిపత్రం సమర్పించారు. చల్లపల్లి నారాయణరావు నగరులో షాదీఖానా నిర్మాణానికి నిధులు సమకూర్చాలని గౌసియా మస్జీద్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు షుబ్లీకి వినతిపత్రం సమర్పించారు.

కార్యక్రమానికి నేతృత్వం వహించిన గ్రామ మాజీ ఉప సర్పంచ్ మమ్మనేని రాజకుమార్ (నాని) మాట్లాడుతూ చల్లపల్లి షాదీఖానాకు లిప్ట్ సౌకర్యంతో పాటు మరికొన్ని పనులు ఉన్నాయని, షుబ్లీ సహకారంతో ఎన్ని నిధులు ఇస్తే వాటికి సమానమైన ఆర్థిక సహకారం తాను సమకూర్చుతానని నాని ప్రకటించారు.

నూతన కమిటీకి నాయకుల సత్కారం..

ఈ సందర్భంగా చల్లపల్లి ఉర్దూ ఘర్ కం షాదీ ఖానా నూతన కార్యవర్గ అధ్యక్షులు మహమ్మద్ అమీర్ బేగ్, సభ్యులు అబ్దుల్ సత్తార్, షేక్ నసీర్ ఘోరీ, పఠాన్ అబ్దుల్ జిలాని, సఖీనా సుల్తానాలను అతిధులు, కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు.

టీడీపీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ రబ్బానీ, ఏఎంసీ చైర్మన్లు కొల్లూరి వేంకటేశ్వరరావు, తోట కనకదుర్గ, మాజీ సీడీసీ చైర్మన్ రావి నాగేశ్వరరావు, రావెళ్ళ ఫౌండేషన్ చైర్మన్ రావెళ్ళ ఉదయ్ కుమార్, స్టేట్ కార్పొరేషన్ల డైరెక్టర్లు బోలెం నాగమణి, పైడిపాముల స్వప్న, టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు మోర్ల ప్రసాద్, జిల్లా టీడీపీ మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ హఫీజుర్ రెహమాన్, ముస్లిం పెద్దలు షేక్ రసూల్ ఘోరీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ నబీఘోరీ, ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ షేక్ దిల్షాద్ నజరానా, మస్జీద్ కమిటీ మాజీ అధ్యక్షులు సయ్యద్ గాలబ్, డీసీ చైర్మన్ నిడమానూరు దిలీప్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ బొందలపాటి వీరబాబు, ఏఎంసీ డైరెక్టర్ ఇబ్రహీం, గుడివాక శివరావు, అడపా రాంబాబు, మోర్ల శివ, ముమ్మనేని సన్నీ, పెద్ద సంఖ్యలో ముస్లిం మైనారిటీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పూలవర్షంతో ఘన స్వాగతం..

ముందుగా పురవీధుల్లో ముస్లిం నాయకులు, కమిటీ పెద్దలు, టీడీపీ, జనసేన నాయకులు అతిధులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు మైనారిటీ యువకులు నాయకులపై పూల వర్షం కురిపించారు.