అమరావతికి చట్టబద్ధత…

అమరావతికి చట్టబద్ధత…
వైసీపీకి రాజకీయ సమాధి..
ఐదుకోట్ల ఆంధ్రుల గర్వదినం
పార్లమెంటులో అమరావతి బిల్లుకు ఆమోదం
మాజీ మంత్రి దేవినేని ఉమా
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే చారిత్రాత్మక ఘట్టానికి నేడు నాంది పలికిందని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించడం ఐదుకోట్ల ఆంధ్రులకుగర్వకారణమని ఆయన పేర్కొన్నారు. గొల్లపూడి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చి అపూర్వ త్యాగం చేశారని, అదే సమయంలో రాజధాని రైతులు 1600 రోజులకుపైగా నిరంతర ఉద్యమం సాగించడం దేశ చరిత్రలోనే అరుదైన ఉదాహరణగా నిలిచిందని ఉమామహేశ్వరరావు గుర్తుచేశారు. ఈ పోరాటం ఫలితంగా అమరావతికి న్యాయం జరిగిందన్నారు. ఐదేళ్ల పాటు అరాచక పాలన సాగించిన వైసీపీ, ఇప్పుడు కూడా మార్పు లేకుండా మూర్ఖత్వం, అహంకారంతో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో విషం చిమ్ముతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించకుండా, అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరించడం వైసీపీ నాయకత్వానికి అలవాటైందన్నారు.
అమరావతి చట్టబద్ధత బిల్లుకు వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించడం ప్రజాభిప్రాయానికి ప్రతిబింబమని ఆయన వ్యాఖ్యానించారు. లోక్‌సభలో బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడం ద్వారా వైసీపీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుందని అన్నారు. ఈ నిర్ణయం ఆ పార్టీకి రాజకీయంగా సమాధి త్రవ్వుకున్నట్టేనని విమర్శించారు. వైసీపీ భవిష్యత్తులో ప్రజల్లో నమ్మకం కోల్పోయి, ఉలిపికట్టె పార్టీగా చరిత్ర పుటల్లో మిగిలిపోతుందని ఉమామహేశ్వరరావు ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆశయాల కోసం అమరావతిని ముందుకు తీసుకెళ్లడం మాత్రమే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని స్పష్టం చేశారు.
