ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు
మంథని, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని మంథనిని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న మంత్రి శ్రీధర్ బాబు సేవలు అమోఘమైనవని మంథని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. శనివారం తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పుట్టినరోజు పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో మంథని బస్టాండ్ లో ప్రయాణికులకు, ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం, భారీ ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులను పరామర్శించి వారికి పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని తన భుజస్కందాల పైన మోస్తున్నటువంటి ఏకైక నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు అని కొనియాడారు. అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు మంత్రి నుండి ఎన్నిక కావడం మనందరి గర్వకారమని పేర్కొన్నారు. విద్యావంతుడు, నిరంతరం రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపిస్తున్న నేత మంత్రి శ్రీధర్ బాబు మాత్రమేనని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకుల ఆయన ప్రజాసేవ చేస్తున్నారని తెలిపారు.
యువతకు ఉపాధి కల్పన, నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందున్నారని వివరించారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని, గొప్ప పదవులను కాంక్షించి, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్, నాయకులు ఉప్పట్ల శ్రీను, మంథని సత్యం, సర్పంచ్ రామస్వామి, యువ నాయకులు శ్రీకాంత్, ప్రవీణ్, ఇందారపు అనిల్, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
