హౌస్ లిస్టింగ్ సర్వేకు ప్రజలు సహకరించాలి..

హౌస్ లిస్టింగ్ సర్వేకు ప్రజలు సహకరించాలి..
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జనాభా గణన-2027లో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించి ఎన్యూమరేటర్లకు వాస్తవ సమాచారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హౌస్ లిస్టింగ్ సర్వేలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని ఎన్యూమరేటర్‌కు అవసరమైన వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
హౌస్ లిస్టింగ్ సర్వే జనాభా గణన-2027లో అత్యంత కీలకమైన దశ అని తెలిపారు. ప్రతి ఇంటి నిర్మాణం, గృహ సౌకర్యాలు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య సదుపాయాలు, విద్యుత్, వంట ఇంధనం, కమ్యూనికేషన్ సౌకర్యాలు తదితర వివరాలను ఈ సర్వే ద్వారా నమోదు చేస్తారని చెప్పారు. సర్వే ద్వారా సేకరించే సమాచారం ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో సహకరించి సరైన వివరాలను అందించాలని కలెక్టర్ సూచించారు. సర్వేలో అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, ఈ సమాచారంతో సంక్షేమ పథకాలకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి అపోహలకు తావివ్వకుండా సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, పర్యవేక్షకులు నిబంధనల ప్రకారం ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను నమోదు చేయాలని, సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
