మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సీతక్క
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సీతక్క
మహిళా సంఘాల సమాఖ్య భవనాల నిర్మాణానికి శ్రీకారం
ములుగు, (ఆంధ్రప్రభ): గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, మహిళా సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
గురువారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం గ్రామంలో మహిళా సంఘాల సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మండలంలోని ఆరు మహిళా సంఘాల సమాఖ్య భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
సుమాంజలి, కిరణాంజలి, ప్రేమాంజలి, కమలాంజలి, పుష్పాంజలి, గీతాంజలి గ్రామ సంఘాలకు సంబంధించిన సమాఖ్య భవనాలు నిర్మించనున్నారు. ఈ భవనాలు పూర్తయిన అనంతరం మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, పొదుపు-రుణాల నిర్వహణ, జీవనోపాధి కార్యకలాపాల అమలుకు శాశ్వత కేంద్రాలుగా ఉపయోగపడనున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్నాయని అన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను మరింతగా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, గోవిందరావుపేట గ్రామ సర్పంచ్, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
