ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

అర్హులైన వారిని గుర్తించి జాబితాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం

ఆసిఫాబాద్, (ఆంధ్రప్రభ): జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎల్-1 జాబితాలో ఉన్న గుడిసెల నివాసితుల ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కే. హరిత అధికారులను ఆదేశించారు.

గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి మండల అభివృద్ధి అధికారులు, ఎంపీవోలు, సెర్ప్ ఏపీఎంలు, ఈజీఎస్ ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న గ్రామ సచివాలయ భవనాలు, పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ ఎల్-1 జాబితాలో ఉన్న గుడిసెల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నమోదు చేసి జాబితాలు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియలో ఇందిరమ్మ కమిటీలు, మహిళా సంఘాల సభ్యుల సహకారం తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటికీ నీటి కనెక్షన్ల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.

ఇంకుడు గుంతల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పాఠశాలల ప్రహరీ గోడలు, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తరావు, డీఆర్‌డీఏ పీడీ ప్రకాశ్‌రావు, హౌసింగ్ ఈఈలు, ఏఈలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఎంలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.