పరామర్శతో రాజకీయ హుందాతనం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: అనారోగ్యంతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు.
గత ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ చేసినప్పటికీ, వ్యక్తిగతంగా పరస్పర గౌరవం, మానవీయ విలువలను చాటుతూ దొంతి మాధవ రెడ్డి పరామర్శించడం రాజకీయ హుందాతనానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాలు సహజమైనవేనని, అయితే ఆపదలో ఒకరికి ఒకరు అండగా నిలవడం మంచి రాజకీయ సంస్కృతికి ప్రతీక అని స్థానికులు పేర్కొన్నారు.
ప్రజా జీవితంలో మానవత్వం, పరస్పర గౌరవం, హుందాతనం వంటి విలువలు మరింత బలపడాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.
