Minister | కాంగ్రెస్‌ది అరాచ‌క పాల‌న‌

Minister | కాంగ్రెస్‌ది అరాచ‌క పాల‌న‌

  • ఇదేం ప్రజాపాల‌న అంటూ స‌ర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
  • నేనే రాజు.. నేనే మంత్రి అంటే ప్ర‌జ‌లే బుద్ది చెబుతార‌ని హెచ్చ‌రిక‌
  • ఎన్ని కేసులు పెట్టినా గులాబీ సైనికులు ప్రశ్నిస్తూనే ఉంటార‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • ఫేక్ పోస్టులు పెట్టిన వారిపై కేసులెందుకు పెట్టలే
  • మన్నె క్రిశాంక్‌పై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాల‌ని డిమాండ్‌
  • రేవంత్ రెడ్డి పాలనకు రోజులు దగ్గరపడ్డాయ‌ని వ్యాఖ్య‌

Minister | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ది అరాచక పాలన అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే అక్ర‌మ కేసులు బ‌నాయించి జైలుకు పంప‌డ‌మేనా ప్ర‌జాపాల‌న అని నిదీశారు. నేనే రాజు.. నేనే మంత్రి అంటూ వ్య‌వ‌హ‌రిస్తున్న ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి ప్ర‌జ‌లే త‌గిన బుద్ధి చెబుతార‌ని హెచ్చ‌రించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి హరీష్ రావు పరామర్శించారు.

ఆయనతో పాటు మరో ఏడుగురు పార్టీ కార్యకర్తలను కూడా కలిసి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫేక్ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా, ఆధారాలతో ఫిర్యాదు చేసిన క్రిశాంక్‌ను అరెస్ట్ చేయడం కక్షసాధింపే అని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్‌లు, కమిషన్లతో అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.

నియంతలా వ్యవహరిస్తున్న సీఎం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్రిశాంక్‌పై నాన్‌-బెయిలబుల్ కేసులు నమోదు చేయడంపై మెజిస్ట్రేట్ కూడా పోలీసులను ప్రశ్నించారని పేర్కొన్నారు. అంగన్‌వాడీ ఫోన్ల కుంభకోణం, టెన్త్ పేపర్ లీక్, హెచ్‌సీయూ గచ్చిబౌలి భూములు, సోమ్ డిస్టిలరీస్ వ్యవహారం, మిస్ వరల్డ్ పోటీల వివాదం వంటి అంశాలను ప్రస్తావించినందుకే క్రిశాంక్‌పై వరుసగా కేసులు పెట్టారని హరీశ్ రావు ఆరోపించారు. భారత పౌరులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాపింగ్‌..

అదేవిధంగా, కొందరు ఐపీఎస్ అధికారులు బెంగళూరుకు చెందిన ప్రైవేట్ వ్య‌క్తుల‌ను కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టి ఫోన్లు, సీసీ కెమెరాలను హ్యాక్, ట్యాపింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్తులో విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. రైతుల సమస్యలపై కూడా హరీశ్ రావు స్పందించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

మక్కలకు కొత్త పరిమితులు విధించడం, వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇస్తారా లేదా అన్న విషయంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

క్రిశాంక్‌పై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తుందని హరీశ్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మణిక్ రావు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply