MBNR-Hanwada | ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన బీజేపీ సర్పంచులు..
MBNR-Hanwada | ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన బీజేపీ సర్పంచులు..
- హన్వాడ మండల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి
హన్వాడ, ఆంధ్రప్రభ: హన్వాడ మండలానికి చెందిన బీజేపీ సర్పంచులు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ గ్రామాల అభివృద్ధికి సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి, మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
సర్పంచులు గ్రామాల్లో పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) భవనాల ఏర్పాటు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారానికి కొత్త బోర్‌వెల్స్ మంజూరు వంటి పలు కీలక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, సంబంధిత పనులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని కొత్తపేట సర్పంచ్ పి. చెన్నప్ప, పెద్దదర్పల్లి సర్పంచ్ దీప్తి రఘురాం గౌడ్ విజ్ఞప్తి చేశారు.
వినతిపై స్పందించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సర్పంచులు ప్రస్తావించిన సమస్యలను సానుకూలంగా పరిశీలించి, అవసరమైన నిధులు, పరిపాలనా అనుమతులు త్వరితగతిన మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచులు భరత్ యాదవ్, తిరుమలేష్ యాదవ్, ఆంజనేయులు, కేశవులు, రాజు యాదవ్, శంకర్‌తో పాటు ఆయా గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
