నెయ్యి వ్యాపారి కుటుంబం అదృశ్యం.. మంచిర్యాలలో కలకలం

15 రోజులుగా ఆచూకీ లేదు..

ఆర్థిక ఇబ్బందుల కోణంలో చర్చ

మంచిర్యాల, ఆంధ్రప్రభ: మంచిర్యాల పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ప్రముఖ నెయ్యి వ్యాపారి, మల్లిఖార్జున ఎంటర్‌ప్రైజెస్ యజమాని బోయిని సంపత్ కుమార్ కుటుంబంతో కలిసి అదృశ్యమైన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత 15 రోజులుగా సంపత్ కుమార్ కుటుంబం ఆచూకీ లభించకపోవడంతో బంధువులు, స్నేహితులు, అప్పులిచ్చిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సంపత్ కుమార్ వివిధ వ్యక్తుల వద్ద సుమారు రూ.60 లక్షల వరకు అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన సొంత ఇంటిపై సుమారు రూ.70 లక్షల గృహ రుణం ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కుటుంబంతో సహా కనిపించకపోవడంతో అప్పులిచ్చిన వారు తమ సొమ్ము తిరిగి వస్తుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పట్టణంలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.

వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.

ఈ విషయమై సంపత్ కుమార్ తల్లిదండ్రులు, అన్నదమ్ములు స్పందిస్తూ, తమకు ఆ కుటుంబంతో ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని, వారు ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదని తెలిపారు.