శిథిలావస్థలో కొత్తూరు పాఠశాల

రేకుల షెడ్డు నిర్మాణానికి సర్పంచ్ శ్రీకారం

కన్నాయిగూడెం, ఆగస్టు 5 (ఆంధ్రప్రభ): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ నిధులతో తాత్కాలిక రేకుల షెడ్డు నిర్మాణానికి సర్పంచ్ జాడి రాంబాబు శ్రీకారం చుట్టారు.

పాఠశాల భవనం పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతుండటంతో ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన సర్పంచ్ జాడి రాంబాబు.. ప్రభుత్వం నుంచి నూతన పాఠశాల భవనం మంజూరయ్యే వరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల ఆవరణలోనే తాత్కాలిక రేకుల షెడ్డు నిర్మించాలని నిర్ణయించారు.

ఈ మేరకు బుధవారం కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. వారం రోజుల్లో షెడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి, అనంతరం అక్కడే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కోరారు.

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తాత్కాలిక వసతి ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్థులు సర్పంచ్ జాడి రాంబాబును అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు, గ్రామస్థులు కల్వచర్ల నర్సింహారావు, తాటి కనకసేన, కావిరి సదానందం, జాడి జనార్ధన్, తాటి రాజశేఖర్, జనగాం హరిబాబు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.