తల్లిపాలతో చిన్నారులకు ఆరోగ్యం
మైలారం సర్పంచ్ నూనె దివ్య
హనుమకొండ/శాయంపేట, ఆగస్టు 5 (ఆంధ్రప్రభ): తల్లిపాలే చిన్నారుల ఆరోగ్యానికి తొలి రక్షణ కవచమని మైలారం సర్పంచ్ నూనె దివ్య, ఏఎన్‌ఎం మమత పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మైలారం అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శిశువు జన్మించిన వెంటనే తల్లిపాలను అందించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. తొలి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం పోషకాహారంతో పాటు రెండేళ్ల వయస్సు వరకు తల్లిపాలను కొనసాగించడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందని వివరించారు.
అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
