విశాఖపట్నంలో ఈడీ సోదాలు..
- మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ నివాసంలో తనిఖీలు
విశాఖపట్నం, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలోని సీతమ్మధారలో మాజీ ఎమ్మెల్యే, వెల్‌ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లా విజయప్రసాద్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున సుమారు ఐదు నుంచి ఆరు గంటల మధ్య రెండు వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారుల బృందం నివాసంలోకి ప్రవేశించింది. సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటి గేట్లను మూసివేసి, ఆయుధాలతో కేంద్ర భద్రతా సిబ్బందిని మోహరించారు. నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.
సోదాలకు ప్రధాన కారణం..
వెల్‌ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థపై గతంలో ఒడిశా ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ నమోదు చేసిన చిట్‌ఫండ్, ఆర్థిక మోసం కేసులే దీనికి ప్రధాన కారణం. 2009 నుంచి 2014 మధ్యకాలంలో అధిక లాభాల హామీతో సంస్థ వేలాది మంది పెట్టుబడిదారుల నుంచి డిపాజిట్లు సేకరించి, భారీ మొత్తంలో నిధులు సమీకరించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
తదుపరి విచారణ..
ఈ కేసులో 2021లో ఒడిశా ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ మల్లా విజయప్రసాద్‌ను అరెస్టు చేయగా, అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం అదే కేసుకు సంబంధించిన నిధుల ప్రవాహం, ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ అంశాలపై ఈడీ విచారణ కొనసాగిస్తోంది. బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన లావాదేవీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఈ సోదాలపై ఈడీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
