ఆగస్టు 7న కొలనుభారతిలో ఆధ్యాత్మిక వైభవం

  • శాకంభరీ రూపంలో సరస్వతీ అమ్మవారు
  • ఆకుకూరలతో అమ్మవారి అద్భుత అలంకారం

నంద్యాల ప్రతినిధి (ఆంధ్రప్రభ) : అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల దేవస్థానం దత్తత ఆలయమైన కొలనుభారతి క్షేత్రంలో ఆగస్టు 7న సరస్వతీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు బుధవారం తెలిపారు.

లోకకల్యాణం కోసం కొలనుభారతి క్షేత్రంలో తొలిసారిగా ఈ విశిష్ట శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సరస్వతీ అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో అలంకరించి విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఉత్సవానికి అవసరమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తదితర సామగ్రిని దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు చిట్టిబొట్ల భరద్వాజ శర్మ ఆధ్వర్యంలో దాతలు సమకూరుస్తున్నట్లు వెల్లడించారు.

ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 7న ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.00 నుంచి 7.30 గంటల వరకు ఉత్సవ సంబంధిత పూజలు జరుగుతాయి. ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి.

మధ్యాహ్నం 12.30 నుంచి 1.00 గంటల వరకు మధ్యాహ్నకాల అర్చనలు, మహానివేదనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.00 నుంచి 2.30 గంటల వరకు విరామం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5.00 గంటల తర్వాత అమ్మవారికి పూజలు నిర్వహించి ఆలయ ద్వారాలను మూసివేస్తారు.

శాకంభరీ ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సరస్వతీ అమ్మవారి కృపాకటాక్షాలను పొందాలని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు కోరారు.