మంటల్లో చిక్కుకుని…

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో వ్యర్థాలను తగులబెట్టే సమయంలో అనుకోకుండా మంటలు అంటుకోవడంతో వృద్ధురాలు పావులూరి పిచ్చమ్మ (70) సజీవదహనమయ్యారు. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం… పిచ్చమ్మ తన పొలంలో పేరుకుపోయిన వ్యర్థాలను తగలబెడుతుండగా మంటలు ఒక్కసారిగా అదుపు తప్పాయి. దీంతో ఆమె మంటల్లో చిక్కుకుని బయటపడలేకపోయారు.

స్థానికులు గమనించి మంటలు ఆర్పేలోపే ఆమె తీవ్రంగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.