Tabu | ఏఐతో ఆటలు వద్ద.. టబు లీగల్ వార్నింగ్..!
Tabu | ఏఐతో ఆటలు వద్ద.. టబు లీగల్ వార్నింగ్..!
Tabu | ఫోటోలు, వీడియోలు, వాయిస్ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటి
ఇటీవలే మృణాల్ ఠాకూర్ కూడా తీవ్ర హెచ్చరిక..
సినీ ప్రముఖుల్లో పెరుగుతున్న ఆందోళన
Tabu | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సినీ ప్రముఖుల ఫోటోలు, వీడియోలు, వాయిస్‌లను అనుమతి లేకుండా వినియోగించడం కొత్త సమస్యగా మారుతోంది. ఈ తరహా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు బాలీవుడ్ నటి టబు చట్టపరమైన పోరాటానికి దిగారు. తన ఫోటోలు, వీడియోలు, స్వరాన్ని అనుమతి లేకుండా ఏఐ సాయంతో ఉపయోగించకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టబు పిటిషన్లో తన వ్యక్తిత్వ హక్కులు, గోప్యతకు భంగం కలిగించేలా డీప్‌ఫేక్‌లు, నకిలీ వీడియోలు, స్వరాలను రూపొందించే చర్యలను అడ్డుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికల్లో సెలబ్రిటీల పేర్లతో తప్పుడు కంటెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోర్టు జోక్యం అవసరమని ఆమె పేర్కొన్నారు.
ఇదే అంశంపై ఇటీవల మరో ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన ఫోటోలు, వీడియోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి లేదా అనుమతి లేకుండా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతతో డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ ఆడియోలు సృష్టించడం సులభమవుతున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యక్తులు తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిణామాలు డిజిటల్ వేదికల్లో ఏఐ వినియోగంపై మరింత బాధ్యత, కఠిన నిబంధనల అవసరాన్ని మరోసారి చర్చనీయాంశంగా మారుస్తున్నాయి.
