కన్నతల్లిలా అత్తకు చివరి వీడ్కోలు..

  • అత్తను అమ్మగా భావించి అంతిమ సంస్కారాలు చేసిన కోడలు
  • రాంపూర్‌లో మానవత్వానికి నిదర్శనం..
  • కుటుంబ విలువలకు కొత్త నిర్వచనం

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : సమాజంలో అత్తా–కోడళ్ల మధ్య విభేదాలు, కోర్టు కేసులు, కుటుంబ కలహాల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్న ఈ రోజుల్లో వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ నల్లబెల్లి మండలం రాంపూర్ (మేడపల్లి) గ్రామంలో జరిగిన ఓ ఘటన అందరి హృదయాలను కదిలించింది. బంధాలు రక్తసంబంధాలతోనే కాదు.. ప్రేమ, ఆప్యాయత, బాధ్యతతోనూ నిలుస్తాయని ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది.

రాంపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు జకినపెల్లి లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందారు. ఆమెను కన్నతల్లిలా చూసుకున్న కోడలు జకినపెల్లి ఊర్మిళ చివరి క్షణం వరకు సేవలు అందించడమే కాకుండా, అంత్యక్రియల్లో సంప్రదాయంగా కుమారులు నిర్వహించే తలగోరు కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించి అత్తపై తనకున్న ప్రేమ, గౌరవాన్ని చాటుకున్నారు.

అంతిమయాత్రలో కన్నీళ్లు పెట్టుకుంటూ “ఆమె నాకు అత్త కాదు… అమ్మ” అని ఊర్మిళ చెప్పిన మాటలు అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేశాయి. ఆ క్షణంలో అత్తా–కోడళ్ల బంధం కాకుండా తల్లీ–కూతుళ్ల అనుబంధమే కనిపించిందని గ్రామస్థులు పేర్కొన్నారు.

గ్రామస్థులు మాట్లాడుతూ, కోడలిని కూతురిలా ఆదరిస్తే ఆమె కూడా అత్తమామలను తల్లిదండ్రుల్లా చూసుకుంటుందని ఈ ఘటన నిరూపించిందన్నారు. ప్రేమ, పరస్పర గౌరవం, ఆప్యాయత ఉంటేనే కుటుంబ బంధాలు బలపడతాయని అభిప్రాయపడ్డారు.

వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అవసరమయ్యేది ఆస్తి కాదు.. ఆప్యాయత, అండగా నిలిచే మనుషులేనని, తల్లిదండ్రులను చూసుకోవడం కేవలం కొడుకుల బాధ్యత మాత్రమే కాదని, కూతుళ్లు, కోడళ్లు, అల్లుళ్లు కూడా సమాన బాధ్యతతో ముందుకు రావాలని ఈ సంఘటన సమాజానికి సందేశం ఇస్తోందని పలువురు పేర్కొన్నారు.

రాంపూర్‌లో ఊర్మిళ చూపిన మానవత్వం, కుటుంబ విలువలు నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు కొనియాడారు. “బంధాలను నిలబెట్టేది రక్తసంబంధం కాదు.. ప్రేమ, గౌరవం, మానవత్వం” అనే సందేశాన్ని ఈ సంఘటన చాటిచెప్పిందని వారు అభిప్రాయపడ్డారు.